ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా కొత్త రూపాలు దాల్చాయి. మనకు తెలిసిన సైబర్ క్రిమినల్స్ తరచుగా విదేశాల్లో ఉండేవారనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు సైబర్ నేరగాళ్లుగా మారుతున్న వారిలో మన చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కనిపిస్తున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఘటనలు ఈ వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి.
ఈజీ మనీ ఆరాటమే ఎక్కువ మంది యువత సైబర్ క్రిమినల్స్‌గా మారడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నేరాలకు పాల్పడేవారిలో కొందరు ఎథికల్ హ్యాకింగ్ వంటి కోర్సులు నేర్చుకుని దానిని తప్పుదోవలో ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారిన వారు అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక నేరాలకు ఉపక్రమిస్తున్నారు. సాంకేతికతపై అవగాహన కలిగి ఉండటం వీరికి నేరాల జోలికి వెళ్లడం సులభం చేస్తోంది.
ఇటీవల తిరుపతికి చెందిన ఒక బీటెక్ విద్యార్థి OLX ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి రూ. 60 లక్షలు మోసం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ విద్యార్థి తన అవగాహనను ఉపయోగించి ఖరీదైన ఫోన్ల ఫోటోలు OLX నుంచి డౌన్‌లోడ్ చేసి తక్కువ ధరకే వాటిని విక్రయిస్తున్నట్లు పోస్ట్ చేసేవాడు. ఫోన్ కొనుగోలు చేసే వాళ్లను ముందే UPI ద్వారా డబ్బు చెల్లింపులు చేయించుకుని, అనంతరం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి జాడ మాయం అయ్యేవాడు. డార్క్ వెబ్, హ్యాకింగ్ టూల్స్ లభ్యమవ్వడం, సైబర్ నేరగాళ్లతో సంబంధాలు ఏర్పరచుకోవడం వంటి అంశాలు యువతను సైబర్ క్రిమినల్స్‌గా మారుస్తున్నాయి. ఈ టూల్స్‌ను ఉపయోగించి ఎలాంటి మోసాలు చేయాలో తెలిసి వారు వందలాది మందిని మోసం చేస్తున్నారు.
ఈ విధంగా కొందరు యువత లభ్యమైన డబ్బును ఇతర అక్రమ క్రియాకలాపాలకు ఉపయోగిస్తున్నారు.సైబర్ నేరాలను నియంత్రించడంలో అవగాహన ప్రధాన పాత్ర పోషిస్తుంది. విద్యార్థులలో సైబర్ క్రైమ్ పట్ల అవగాహన పెంచడం, దాని తీవ్రతను అర్థం చేయడం, అనైతిక నేరాలకు పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాలు వారికి వివరించాలి.
ప్రతి కాలేజీ మరియు విద్యాసంస్థల్లో సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక శిక్షణ అవసరం.సాంకేతికతను ఉపయోగించి ముందుకు సాగడమే కాదు, దాని ద్వారా చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడడం యువత జీవితాలను పాడు చేస్తోంది. కాబట్టి విద్యార్థులు వారి సాంకేతిక నైపుణ్యాలను సన్మార్గంలో ఉపయోగించాలని గుర్తించడం అత్యవసరం.ప్రతి విద్యార్థి సరైన మార్గంలో నడిచి, ఈజీ మనీ లోనవకుండా చట్టబద్ధంగా డబ్బు సంపాదించగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలి. దీంతో నేరాల ప్రభావం తగ్గి, సైబర్ ప్రపంచం మరింత సురక్షితంగా మారుతుంది.