ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. షిండే వెంట డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని షిండేను గవర్నర్ కోరారు.
కాగా, మహారాష్ట్ర రాజకీయ అత్యున్నత స్థానం కోసం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధినేత ఏక్నాథ్ షిండే పోటీపడుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 132 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినందున, ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ వాదనకు బలం చేకూరింది. శివసేన 57 సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ, బీహార్‌లో ఎన్‌డిఎ రాజకీయ ఏర్పాటును ఉటంకిస్తూ అగ్ర పదవిని డిమాండ్ చేస్తోంది. సంకీర్ణంలో బీజేపీకి ‘పెద్దన్న’ హోదా ఉన్నప్పటికీ నితీష్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుత అసెంబ్లీ గడువు నేటితో ముగియనుంది. ఇంతవరకూ సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.