న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఈ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సమావేశాలు అత్యంత కీలకమన్నారు. పార్లమెంట్‌లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను మోడీ కోరారు. ‘‘ప్రస్తుతం మనం 2024ను పూర్తి చేసుకోబోతున్నాం. 2025 కోసం దేశం సిద్ధమవుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాలు ఎన్నో అంశాలపరంగా ముఖ్యమైనవి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబరు 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. దానికి గుర్తుగా రేపు సంవిధాన్ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందాం’’ అని మోడీ మీడియాతో మాట్లాడారు.
“అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, కొత్త పార్లమెంటేరియన్లు కొత్త ఆలోచనలు, కొత్త శక్తిని తీసుకువస్తారు. వారిలో అన్ని పార్టీల సభ్యులుంటారు. వారి హక్కులను కొంతమంది లాక్కోవడం ద్వారా వారికి సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు. కానీ 80-90 సార్లు ప్రజలచే తిరస్కరణకు గురైన వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించడం లేదు. కనీసం ప్రజల ఆకాంక్షల ప్రాముఖ్యతను అర్థం చేసుకోరు. ఫలితంగా వారు ఎన్నడూ ప్రజల అంచనాలకు అనుగుణంగా వారు జీవించలేరు ” అంటూ ప్రతిపక్షాలను విమర్శించారు.