హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వేములవాడ పర్యటనకు వెళ్లనున్నారు. మొదట వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్న సీఎం.. అనంతరం స్థానికంగా రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాగా.. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉండనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ప్రధానంగా రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి కొండా సురేఖ కూడా పర్యటనలో పాల్గొననున్నారు. ఆమె కూడా సీఎంతో కలిసి రాజన్నను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతారు. చివరిగా బహిరంగసభలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఇప్పటికే వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
కాగా, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి వేములవాడలో బుధవారం పర్యటిస్తున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం పర్యటనను సక్సెస్ చేసే పనిలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారు. మంత్రులతో కలిసి సీఎం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని రూ.127 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. జిల్లాకు వస్తున్న సీఎం వరాల జల్లు కురిపిస్తారని వేములవాడకు మహార్దశ రానున్నదని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.