ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల..కూటమి సర్కార్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వంలో ఎలాగైతే అత్యాచారాలు , మహిళలపై దాడులు , క్రైమ్ ఎలా ఉందొ..ఇప్పుడు కూటమి సర్కార్ లో కూడా అదే నడుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా… వైసీపీ, టీడీపీ పార్టీల తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏదైనా జరిగినప్పుడు.. హడావిడి చేస్తున్న ప్రభుత్వాలు ఆ తర్వాత మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు.
రాష్ట్రంలోని శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో.. అక్కడ మహిళలు, చిన్నారుల మీద జరుగుతున్న దాడులను చూస్తే తెలుస్తుంది. ఇదే అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు… ఆంధ్రప్రదేశ్ విడిపోయనప్పటి నుంచి ఇప్పటి వరకు దాడులు ఎందుకు ఆగలేదని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టడంలో వైసీపీ, టీడీపీ లు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.
దాడుల్ని సమర్థవంతంగా నిరోధించాల్సింది పోయి..నీ పాలనలో ఎక్కువ జరిగాయంటే, నీ పాలనలోనే ఎక్కువ జరిగాయని ఆరోపించుకుంటున్నారు అని ఆమె పెక్రోన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జరిగే చర్చే అందుకు నిదర్శం అన్నారు. మహిళలపై దాడులకు సంబంధించి 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో నమోదైనవి 83 వేల 202 కేసులేనట, 2019 నుంచి 24 వరకు నమోదైనవి 1 లక్షా 508 కేసులంట. అంటే.. టీడీపీ పాలనలో కంటే వైసీపీ హయాంలోనే 20 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని టీడీపీ అంటోందన్నారు. ఈ విమర్శలకు.. లేదు లేదు.. కూటమి అధికారంలో వచ్చాకే రోజుకు సగటున 59 అత్యాచారాలు నమోదు అని వైసీపీ ప్రచారం చేస్తోందని షర్మిళ వెల్లడించారు.
అంటే.. ఇద్దరి హయాంలో మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయన్న షర్మిళ.. మహిళల మానప్రాణాల మీద రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం.. గడిచిన 10 ఏళ్లలో సుమారు 2 లక్షల కేసులు నమోదు అయ్యాయంటే.. మహిళలకు భద్రత కల్పించడంలో మన రాష్ట్రం ఎక్కడుందో అర్థమవుతుంది అంటూ విమర్శలు చేశారు.
ప్రభుత్వంలో ఎవరున్నా.. క్రైమ్ రేట్ అరికట్టడంలో విఫలమయ్యాయి అంటూ విమర్శించారు. వైసీపీ, టీడీపీలు రెండూ దొందు దొందే అన్నారు. పైగా.. ఒకరంటే, ఒకరని విమర్శలు చేసుకోవడం సిగ్గు చేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అంటూ వ్యాఖ్యానించారు. ఏపీలో చట్టాలు పేరుకే తప్పా.. సరిగా పనిచేయడం లేదని అన్నారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన
నిర్భయ చట్టం, జగన్ హయాంలోని దిశ చట్టం ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నించారు.
నిర్భయ చట్టం ప్రకారం మహిళలపై వికృత చేష్టలకు పాల్పడితే.. 40 రోజుల్లో కఠిన శిక్షలు అని చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. అది కాదని.. దిశ చట్టం పేరుతో ప్రత్యేక చట్టం చేసిన జగన్ ఏం సాధించారని విమర్శించారు. ఈ చట్టం కింద మహిళలపై ఏవైనా నేరాలకు పాల్పడితే.. కేవలం 20 రోజుల్లోనే ఉరి శిక్ష పడేలా చూస్తానంటూ జగన్ చేసిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజల చెవుల్లో క్యాలీప్లవర్లు పెట్టారని.. చట్టాలను మాత్రం అమలు చేయ లేదని ఆరోపించారు.
రాష్ట్రాన్ని చెరోసారి పాలించిన నేతలు.. భద్రతకు పెద్ద పీట వేస్తున్నట్లు ప్రచారాలు చేసుకున్నారు కానీ, ఎక్కడా ఫలితం లేదని అన్నారు. గత 10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ ఈ చట్టాల కింద కఠిన శిక్షలు పడలేదని అన్నారు. కేసులను ఛేదించాల్సిన పోలీసుల్ని.. రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సరిగా పనిచేసుకోకుండా.. నాయకులు అడ్డుపడుతున్నారంటూ ఆరోపించారు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు , అఘాయిత్యాలను అరికట్టడంలో గత 10 ఏళ్లుగా @JaiTDP టీడీపీ, వైసీపీ @YSRCParty ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇవ్వాళ శాసనమండలిలో జరిగిన చర్చనే ఇందుకు నిదర్శనం. 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో నమోదైనవి 83,202 కేసులట. 2019 నుంచి 24 వరకు 1,00,508 కేసులట.…— YS Sharmila (@realyssharmila) November 18, 2024