న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, సీనియర్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు కైలాష్ గెహ్లాట్ బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గహ్లోత్ ఆదివారం ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్ కు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం అసంపూర్తి హామీలు ఇస్తోందని.. పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని కైలాశ్ గహ్లోత్ ఆ లేఖలో ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో ఏర్పడిన ఆప్ ఆశయాలను ఆ పార్టీ నేతల రాజకీయ ఆశయాలు అధిగమించాయని మండిపడ్డారు.
ఢిల్లీ మంత్రి కైలాశ్ గహ్లోత్ రాజీనామాపై ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ స్పందిస్తూ.. బీజేపీ దిగజారుడు రాజకీయాలతో కుట్రలను విజయవంతంగా అమలుచేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఒత్తిడి వల్లే తాజా పరిణామం చోటుచేసుకుందని.. గహ్లోత్‌ను సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు టార్గెట్ చేశాయని ఆరోపించారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న గహ్లోత్ ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. బీజేపీ ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే ఆయన ఇప్పుడు ఆరోపిస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కైలాశ్ స్పందించారు.
ఇది నాకు సులభమైన నిర్ణయం కాదు. అన్నా హజారే ఆధ్వర్యంలో 2011-12 సమయంలో దేశంలో పెద్దఎత్తున అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నేను ఆప్‌లో ఉన్నాను. ఎమ్మెల్యే, మంత్రిగా ఢిల్లీకి నావంతు సేవలు అందించాను. ఇది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయమని కొందరు భావిస్తున్నారు. ఒత్తిడి వల్లే ఈ అడుగు వేశానని అంటున్నారు. ఒత్తిడి వల్ల ఎప్పుడూ నేను ఏ నిర్ణయం తీసుకోలేదని వారికి స్పష్టం చేస్తున్నాను అని వెల్లడించారు.