ఇటీవల కాలంలో మావోలకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో వరుసపెట్టి మావోలు కన్నుమూస్తున్నారు. తాజాగా ఈరోజు శనివారం బస్తర్ రీజన్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో ఐదుగురు మావోలు మృతి చెందారు. భద్రతాబలగాల్లో కూడా ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరికి కాలిలో బుల్లెట్ దిగగా, మరొకరికి తలలోకి వెళ్లింది. అయితే ఇద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కంకేర్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులోని మాద్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి భద్రతాబలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాంకేర్ జిల్లా-నారాయణపూర్ జిల్లాల మధ్యనున్న ఉత్తర అంబుజ్‌మద్ ప్రాంతంలో మావోలు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్-స్పెషల్ టాస్క్ ఫోర్సు బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. దీంతో మావోయిస్టులకు- భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.