సీఎం చంద్రబాబు సోదరుడు (తమ్ముడు), రామ్మూర్తి నాయుడు మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణ వార్త తెలిసి..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు..అక్కడి నుండి హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు.
కాగా, శనివారం ఉదయం రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. తన తమ్ముడి భౌతికకాయం చూసి బోరున విలపించారు. తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి కుమారులు నారా రోహిత్, గిరీశ్ లను అక్కన జేర్చుకుని ఓదార్చారు. తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ ఇద్దరు సోదరులకు పెదనాన్నగా ధైర్యం చెప్పారు. రామ్మూర్తినాయుడు భౌతికకాయానికి చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ, సుజనా చౌదరి, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కూడా నివాళులు అర్పించారు.
రేపు ఉ.5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని రేణిగుంట ఎయిర్పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడు. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. రామ్మూర్తి మరణవార్త తెలిసిన టీడీపీ శ్రేణులు సంతాపం ప్రకటిస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం రామ్మూర్తి నాయుడు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు ప్రకటన విడుదల చేశారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం రామ్మూర్తినాయుడు మృతి పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి మరణ వార్త నన్ను కలచివేసింది. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్నందున రామ్మూర్తి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నా. నారా రోహిత్, ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.