హైదరాబాద్: నేడు, రేపు మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర ప్రారంభించనున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి..కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి..! అనే నినాదంతో మూసి పరివాహక ప్రాంతంలో “బీజేపీ మూసీ నిద్ర” కార్యక్రమాన్ని చేయనుంది. మూసీ ప్రక్షాళన – సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి, మూసి సుందరికరణ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని బీజేపీ హెచ్చరిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సవాలును స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాలలో నివాసముంటున్న బాధితుల ఇండ్లల్లో వారితో పాటు మమేకమై.. వారి ఇండ్లలోనే నిద్రించి వారికి అండగా బీజేపీ ఉందని భరోసానిచ్చేందుకే బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. త్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు, మూసి పరివాహక ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నాయకులు మూసి నిద్ర చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు అక్కడే ఉండునున్నారు. రాత్రి భోజనం, ఉదయం అల్పహారం కూడా అక్కడే చేయనున్నారు బీజేపీ నాయకులు.
సియోల్ తరహాలో హైదరాబాద్‌లోని మూసీని పునరుద్ధరిస్తామని తెలంగాణకు చెందిన రేవంత్ సర్కార్ చెబుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఈనెల ఎనిమిదో తేదీన నల్గొండ జిల్లాలోని మూసీ నదీ పరివాహక ప్రాంతంలో పాదయాత్రకు దిగారు. మూసీ పునరుద్ధరణను అడ్డుకుంటే బుల్ డోజర్లతో తొక్కేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అయితే.. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసి ప్రాంత పేదలకు మనోధైర్యాన్ని కల్పించేందుకు, వారికి అండగా నిలుస్తామని కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.. బుల్డోజర్లు వస్తే చావడానికైనా సిద్ధమని చేప్పారు. ఈ క్రమంలోనే.. నేడు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర చేపట్టింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలను బీజేపీ నేతలు సందర్శించిన విషయం తెలిసిందే.