తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు మరో తీపి కబురు అందిస్తూ, వడ్డీలేని రుణాల పై మిత్తి పైసలు విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన మొత్తం రూ.30.70 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం, త్వరలో ఈ నిధులను మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయనుంది.
ప్రాంతాల వారీగా చూస్తే, నల్గొండ జిల్లాలో అత్యధికంగా 5,283 సంఘాలకు రూ.1.99 కోట్లు, నిజామాబాద్‌లో 5,010 గ్రూపులకు రూ.1.91 కోట్లు, ఖమ్మంలో 3,983 సంఘాలకు రూ.1.66 కోట్లు, కరీంనగర్‌లో 3,983 గ్రూపులకు రూ.1.55 కోట్లు విడుదల చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనేక మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ సొమ్ము ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో ఆ సంఘాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాయి. ఈ పాత పెండింగ్ వడ్డీని విడుదల చేయడం ద్వారా మహిళలు ఆర్థికంగా ఉపశమనం కలిగినట్లు అవుతుంది.