కార్తీక పౌర్ణమి సందర్భంగా దేశంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు శివుడు మరియు పార్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలను వెలిగిస్తూ భక్తి పరవశంలో మునిగిపోతున్నారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజును శివభక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామునే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులు దీరారు. శివనామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తులు పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. శివపార్వతులకు అభిషేకాలు చేశారు. పలు ఆలయాల్లో భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతున్నది. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. వరంగల్ వేయిస్తంభాల దేవాలయంలో భక్తులు ఉసిరి చెట్టు కింద పూజలు చేసి దీపాలు వెలిగించి స్వామి దర్శనం చేసుకుంటున్నారు.ఆ అలాగే కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయం, జనగామ జిల్లాలోని పాలకుర్తి శ్రీ సోమేశ్వరస్వామి, కొడవటూరు సిద్దులగుట్ట, ములుగు జిల్లా వెంకటాపురంలోని రామప్ప తదితర ఆలయాలకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లా కందికొండ జాతరకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో కందికొండ భక్తులతో రద్దీగా మారింది. దైవ దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుండటంతో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది.