వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మీద దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. ఈ ప్రాంతంలో మెగా ప్రాజెక్ట్ కట్టాలని ప్రభుత్వం భావిస్తే…ఆ ప్రాజెక్ట్ కోసం తమ పంట పొలాల భూములు ఇచ్చేందుకు మీము సిద్ధంగా లేమంటూ గ్రామస్థులు చెపుతూ వస్తున్నారు. కాగా సోమవారం జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు గ్రామస్థులతో మాట్లాడేందుకు వెళ్లగా..కలెక్టర్ పై దాడి చేసారు. ఈ దాడిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు..పలువుర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కీలక వ్యక్తి సురేశ్ అని గుర్తించామని, అతని కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు.
కలెక్టర్ మీద దాడి ఘటన గురించి ఆయన మాట్లాడుతూ… ఈ ఘటనలో 16 మందిని అరెస్ట్ చేశామని, మరో 57 మంది అదుపులో ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ మేరకు మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు. కలెక్టర్ లగచర్లకు రాగానే ఒక్కసారిగా నినాదాలు చేస్తూ దాడికి ప్రయత్నించారని తెలిపారు. ప్రజలను రెచ్చగొడుతూ కొడంగల్‌లో కలెక్టర్‌పై దాడి చేయించారని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు.
మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..ఈ దాడి వెనక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నదనే అనుమానం ఉన్నదన్నారు. ఆయన ఆదేశాలతోనే దాడిచేసినట్లు స్పష్టమవుతుందన్నారు. తమ వద్ద ఆధారాలన్నీ ఉన్నాయన్నారు. తానే స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాస్తానని వివరించారు. నింధితులపై చర్యలు తీసుకోవాల్సిందేనని నొక్కి చెప్పారు. ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయలని పథకం ప్రకారమే బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడి అని గుర్తు చేశారు. కేసీఆర్ వైఫల్యాలపై కాంగ్రెస్ ఎప్పుడు హింస మార్గంలో పోరాటం చేయలేదని వివరించారు.