హైదరాబాద్: కులగణనకు బీజీపీ అనుకూలమో కాదో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశవ్యాప్తంగా సర్వే చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారో? లేదో చెప్పాలని నిలదీశారు. మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడుతూ… ఎన్నికల కోసం కులగణన చేస్తున్నారని విమర్శిస్తున్నారని, సర్వే అడ్డుకోవాలని చూస్తే లక్ష్మణ్ ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలా? వద్దా అని మండిపడ్డారు.
బీజేపీ ఎన్నికల్లో పూర్తిగా మతం రంగును పూసుకుందని విమర్శించారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మైనారిటీలకు వ్యతిరేకమని అన్నారు. ప్రజలు బీజేపీ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజస్థాన్ ఓ రిజర్వేషన్ అమలు చేస్తుంటే హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారని తెలిపారు. వీపీ సింగ్ రిజర్వేషన్లు తీసుకువస్తే కమండలం పేరు మీద పదవిని ఊడబీకారని అన్నారు. బలహీన వర్గాలకు చెందిన మోడీ, వారు అనుచరుల కోసం పదేళ్లలో ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీ బీసీని సీఎంగా చేస్తామని బీసీ అధ్యక్షుడిని తీసేసిందని ఎద్దేవా చేశారు. అందరి అభిప్రాయం తీసుకున్న తరవాతనే కులగణన చేస్తున్నామని తెలిపారు. బీజేపీ కులగణనకు అడ్డుపడాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏ డాక్యుమెంట్ అడగట్లేదని, సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందని చెప్పారు. బీఆర్ఎస్ చేయలేకపోయిందే తాము చేస్తున్నామని అన్నారు. మూసీ పునరుజ్జీవం కోసమే సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని అన్నారు. మూసీ ప్రజల కష్టాలు తీర్చడం కోసమే తాపత్రేయమని చెప్పారు.
కాగా, తెలంగాణ వ్యాప్తంగా 1,17, 44,00 కోట్ల ఇండ్లు సర్వే చేయడానికి 88 వేల ఎన్యూమరేటర్లను నియమించినట్లు చెప్పారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇండ్లు కేటాయించారని, కుటుంబానికి సంబంధించిన అన్ని రకాల సమాచారం తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని, ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నమే ఈ సర్వే అని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న సమాచారంతో భవిష్యత్‌లో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సర్వేతో ఎవరికీ అన్యాయం జరగదని, ఇబ్బందులు కలగవని, ఈ సర్వే భవిష్యత్తులో అందరికీ న్యాయం జరిగే విధంగా దోహదపడుతుందన్నారు. ఈ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి కాబోతుందన్నారు. సుహృద్భావ వాతావరణంలో సర్వే జరగాలని, అందుకు తెలంగాణ యావత్ సమాజం, స్వచ్ఛంద సంస్థలు, అన్ని కుల సంఘాలు, ప్రతి పక్ష నాయకులు సహృదయంతో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.
ప్రజలను భ్రమ పెట్టి, భయపెట్టే విధంగా ప్రవర్తించకూడదని, అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. సర్వేకు ఆటంకాలు కల్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు. సమాచార సేకరణ అధికారికి పూర్తిగా సహకరించి సమగ్ర సమాచారాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 29,58,277 ఇండ్ల సర్వేకు 20,920 మంది ఎన్యూమరేటర్లను, 1728 మంది సూపర్ వైజర్లను నియమించినట్లు తెలిపారు.