తెలుగు సినిమాల్లో కొత్త తరహా కథలు, భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి సుహాస్ ఎంచుకున్న తాజా చిత్రం జనక అయితే గనక. దిల్ రాజు నిర్మాణంలో సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 12న విడుదలైంది. ప్రస్తుతానికి ఆహా లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. సుహాస్ భిన్నమైన పాత్రలో ఆకట్టుకోవడమే కాకుండా, సినిమాకు వినూత్నమైన కథాంశాన్ని అందించారు. ఈ కథ ఏంటి ఈ సినిమాకు సంబంధించిన అంశాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కథలో ప్రసాద్ (సుహాస్) అనే ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు. తల్లి, తండ్రి, నాయనమ్మ, భార్య (సంగీర్తన) తో కూడిన సాదాసీదా కుటుంబం అతనిది. ప్రసాద్ తక్కువ సంతోషం కలిగిన చిన్న ఉద్యోగం చేస్తూ, ఆర్థిక ఇబ్బందులలో బ్రతుకుతుంటాడు. అతని స్నేహితుడు కిశోర్ (వెన్నెల కిశోర్) ఒక నిరుద్యోగ లాయర్, ఎవరికీ అవసరం కానివాడు. తన పిల్లలకు కావాల్సినవన్నీ ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న కిశోర్‌ను చూసి ప్రసాద్ లో పిల్లలను కనకూడదనే భావన బలపడుతుంటుంది.
ప్రసాద్ కి చిన్నప్పటి నుంచి తగినంత డబ్బు లేకపోవడం వల్ల సరైన చదువు అందలేదు, మంచి ఉద్యోగం రాలేదనే అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది. తన మాదిరిగా తన పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అందువల్ల కుటుంబ నియంత్రణను పాటిస్తూ తన భార్యతో పిల్లల గురించి మాటలు పెట్టుకునేవాడు. కానీ అనుకోని విధంగా ఒక రోజు తన భార్య తాను గర్భవతని చెప్తుంది. కండోమ్ వైఫల్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని భావించిన ప్రసాద్, ఆ కండోమ్ సంస్థపై కోర్టులో కేసు వేయాలని నిర్ణయించుకుంటాడు. ప్రసాద్ నష్టపరిహారం గా కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేయడంతో కథ రసవత్తరంగా మారుతుంది. కోర్టులో, ప్రసాద్ పరిస్థితి ఎలా ఉంటుందనే ఆసక్తికర ప్రశ్న కథను ముందుకు నడిపిస్తుంది. మురళీ శర్మ ప్రముఖ లాయర్ గా, రాజేంద్రప్రసాద్ జడ్జిగా పాత్రధారులుగా మెప్పిస్తారు. కోర్టులో వివాదాస్పదంగా ఉన్న కండోమ్ అంశం చుట్టూ కథ నడుస్తూ, మద్య తరగతి జీవితంలోని భావోద్వేగాలను బయట పెట్టడంలో దర్శకుడు గొప్ప విజయాన్ని సాధించాడు.
జనక అయితే గనక అనేది కామెడీకి తోడు సామాజిక సందేశం కలిగిన సినిమా. సినిమా టైటిల్ తోనే ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. సున్నితమైన పిల్లలు కనకూడదు అనే అభిప్రాయాన్ని సినిమాలో విన్నూత్నంగా చూపించారు. కథ ప్రారంభంలో కుటుంబ అనుబంధాలను చూపిస్తారు, తరువాత కోర్టు రూమ్ డ్రామాగా మార్చారు. రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ పాత్రలు కథను భిన్నమైన కోణంలోకి తీసుకెళ్లి ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఆలోచింపజేస్తాయి.కొత్త హీరోయిన్ సంగీర్తన పాత్ర కూడా ప్రశంసనీయంగా ఉంది. వెన్నెల కిశోర్ తన కామెడీ టైమింగ్ తో కథలో వినోదాన్ని పంచాడు. రాజేంద్రప్రసాద్ జడ్జిగా, మురళీ శర్మ లాయర్ గా ఆకట్టుకునే పాత్రలు పోషించారు.