శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఈరోజు ఎమ్మెల్యేలు పరస్పరం దాడులకు దిగారు. నేడు కార్యక్రమాలు ప్రారంభం కాగానే.. ఇంజినీర్ రషీద్ సోదరుడు, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370 పునరుద్ధరించాలనే పోస్టర్‌ను ప్రదర్శించారు. దీనికి ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర గందరగోళం స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూసుకుపోయి పిడిగుద్దులతో దాడులకు దిగారు. ఇక, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో 15 నిమిషాల పాటు అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
కాగా, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 పునరుద్ధరణపై కేంద్రప్రభుత్వం చర్చలు జరపాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బుధవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ఉపముఖ్యమంత్రి సురేందర్ చౌదరి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జమ్మూకశ్మీర్ ప్రజల హక్కులు, భద్రతతోపాటు ఈ ప్రాంత సంస్కృతిని కాపాడుకునేందుకు తమకు ప్రత్యేక హోదా అవసరమని, ఇది రాజ్యాంగం తమకు ప్రసాదించిన హక్కు అని తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా సురేందర్ చౌదరి వ్యాఖ్యానించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రతిపక్ష నేత సునీల్ శర్మతో పాటు బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. తీర్మాన కాపీలను ముక్కలుగా చింపి అసెంబ్లీలో విసిరేశారు. ఈ గందరగోళం మధ్యే స్పీకర్ తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించారు. మెజారిటీ సభ్యులు దీనికి మద్దతివ్వడంతో తీర్మానాన్ని సభ ఆమోదించింది.