వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా సాగిపోతున్నారు. మరికాసేపట్లో స్పష్టమైన ఫలితాలతో గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియనుంది. ఈ నేపథ్యంలో డెలవేర్లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్బ్రైడ్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి జాన్ వేలెన్ 3 తో, సారా మెక్బ్రైడ్ తలపడ్డారు. సారాకు 95 శాతం ఓట్లు పోలవగా..
వేలెన్కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి. తాను కాంగ్రెస్‌లో చరిత్ర సృష్టించడానికి పోటీ పడలేదని డెలవేర్లో మార్పు కోసమే పోటీ చేసినట్లు సారా పేర్కొన్నారు. సారా మెక్ బ్రైడ్ ఎల్జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో దాదాపు 3 మిలియన్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2016లో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో ఒక ప్రధాన పార్టీ నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన మొదటి ట్రాన్స్జెండర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020లో డెలవేర్లో తొలి ట్రాన్స్ స్టేట్ సెనెటర్గా వ్యవహరించారు. 2010 నుంచి డెలవేరియన్ ఓటర్లు డెమోక్రట్లకే మద్దతిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజా ఎన్నికల్లో సారా మైక్బ్రైడ్ విజయం సాధించారు.
మరోవైపు సెనేటర్ గా గెలిచిన తర్వాత సారా మెక్ బ్రైడ్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘పునరుత్పత్తి విషయంలో స్వేచ్ఛను పరిరక్షించేందుకు అమెరికా కట్టుబడి ఉంటుందనే విషయాన్ని డెలావర్ ఓటర్లు గట్టిగా చాటిచెప్పారు. అమెరికన్లుగా మనకందరికీ కావాల్సిన ప్రజాస్వామ్యం ఇదే’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను గెలిస్తే చైల్డ్ కేర్ కు సంబంధించిన ఖర్చులు అందరికీ అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకుంటానని, ఉద్యోగస్తులకు పెయిడ్ ఫ్యామిలీ, మెడికల్ లీవ్ సౌకర్యం కల్పిస్తానని, హౌసింగ్, హెల్త్ కేర్ విషయాల్లో మెరుగైన వసతులు కల్పిస్తానని సారా హామీ ఇచ్చారు. ట్రాన్స్ జెండర్ల హక్కుల పరిరక్షణకు పాటుపడతానని, సభలో వారి తరఫున గళం వినిపిస్తానని సారా మెక్ బ్రైడ్ తెలిపారు.