సినీ రంగంలో సీనియర్ హీరోలు విలన్ పాత్రలు లేదా ఇతర సహాయక పాత్రల ద్వారా కొత్త ఆవిష్కరణలను చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలా సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ ఇప్పుడు విలన్ పాత్రల్లో సత్తా చాటుతున్నారు. ఆయన కెరీర్‌లో ఓ గుర్తించదగిన చిత్రం “ఒట్టేసి చెబుతున్నా,” 2003లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ రొమాంటిక్ డ్రామాలో శ్రీకాంత్‌తో పాటు శ్రవంతి, శివాజీ, సునీల్ ముఖ్యపాత్రల్లో మెప్పించారు.
ఈ చిత్రానికి ఈ. సత్తిబాబు దర్శకత్వం వహించగా, సంగీతం విద్యాసాగర్ అందించారు. ప్రతి పాట కూడా ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన కనిహా సుబ్రమణ్యం అందంతో పాటు తన అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. చెన్నైకు చెందిన కనిహా మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2001లో మిస్ చెన్నై అందాల పోటీలో విజయం సాధించి, తర్వాత 2002లో మణిరత్నం నిర్మించిన “ఫైవ్ స్టార్” అనే తమిళ చిత్రంలో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
తెలుగులో “ఒట్టేసి చెబుతున్నా”తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కనిహా, అనంతరం రవితేజతో కలిసి “నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమెరీస్” చిత్రంలో అతని భార్యగా నటించింది. తెలుగులో ఈ రెండు చిత్రాలకే పరిమితమైన కనిహా, ఆపై కన్నడలోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. 2008లో అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్యామ్ రాధాకృష్ణన్‌ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. కానీ ఆమె సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ ఫొటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.