అమరావతి: సీఎం చంద్రబాబును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిశారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన వేమిరెడ్డి దంపతులు సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతిని ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నేడు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రశాంతి రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మరోవైపు నిన్న నెల్లూరు జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఆసక్తికర పరిణామం జరగడం తెలిసిందే. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ హాజరైన ఈ కార్యక్రమానికి ఎంపీ హోదాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చారు. అయితే, వేదికపై ఉన్న ఆయనకు అధికారులు బొకే ఇవ్వడం మర్చిపోయారు. దాంతో ఆయన అలిగి అక్కడ్నించి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూడా భర్త వెంటే అక్కడ్నించి వెళ్లిపోయారు.