అమరావతి: ఏపీలో విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. నవంబర్ 4న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన ఉంటుంది. నవంబర్ 14 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 28న ఉపఎన్నిక నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వినియోగించుకోవచ్చు. డిసెంబర్ 1న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
ఇకపోతే.. గతంలో ఈ స్థానంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఇందుకూరి రఘురాజుపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అనర్హత వేటు వేశారు. దీంతో జూన్ 3 నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. మరోవైపు, నోటిఫికేషన్ కారణంగా విజయనగరం జిల్లా గజపతినగరంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రద్దయింది.
కాగా, ముందుగా నిర్ణయించుకున్నదాని ప్రకారం చంద్రబాబు శనివారం విజయనగరం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. శనివారం గజపతి నగరం నియోజకవర్గంలో ‘గుంతల రహిత రోడ్లు’ మిషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రోడ్లు, భవనాలు, మౌలికసదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహిత రోడ్లుగా మిషన్ మోడ్ లో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.