జన్వాడలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై కేటీఆర్ స్పందిస్తూ, “ఇళ్లలో దావత్‌లు చేసుకుంటే తప్పేముందంటూ” వ్యాఖ్యానించారు. అయితే, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కిరణ్ కుమార్ రెడ్డి తన విమర్శల్లో..రేవ్ పార్టీలకు అనుమతులు తీసుకోకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన తెలిపినట్లుగా, ఈ సంఘటన డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించేలా ఉందని, పార్టీలో ఉన్న వారెంత పెద్దవారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీపావళి వంటి పండుగలను రేవ్ పార్టీలతో పోల్చడం తగదని, ఇలాంటి కార్యకలాపాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో 111 జీవో ఎత్తివేయడంతో పలువురు నాయకులు ఫామ్‌హౌస్‌లు కట్టుకుని అడ్డుగా వాడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గతంలో రాజ్ పాకాల సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ నిర్వహించిన చరిత్ర ఉందని, ఈ ఫామ్‌హౌస్ వ్యవహారం ప్రభుత్వంపై తీవ్రమైన ప్రశ్నలను రేకెత్తిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.