దేశాన్ని విభజించే శక్తులు, అవినీతికి పాల్పడేవారు మాకు శత్రువులన్న విజయ్

Vijay

తమిళనాడులో ద్రవిడియన్ మోడల్ పేరిట జరుగుతున్న అవినీతిని సహించబోమని, ప్రజా వ్యతిరేక శక్తులపై తమ పోరాటం సాగుతుందని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు విజయ్ అన్నారు. ఎనిమిది నెలల కిందట తన రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్, తొలిసారి విల్లుపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అధికార డీఎంకేపై, వారి పాలన విధానాలపై విజయ్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. విజయ్ మాట్లాడుతూ, తమ పార్టీ ద్రవిడీయతను, తమిళ జాతీయతను వేరు చేయదని, కానీ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇ.వి.రామస్వామి (పెరియార్), కె.కామరాజ్ వంటి మహానేతల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, తమ పార్టీ కూడా లౌకికవాదం, సామాజిక న్యాయం వంటి సిద్ధాంతాలపై నిలబడిందని ఆయన తెలిపారు.

అయితే, డీఎంకే ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని ద్రవిడ మోడల్ ప్రభుత్వంగా చెప్పుకోవడం అవాస్తవమని, వారు ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారని విజయ్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం అనే నెపంతో దోచుకోవడం, ప్రజల నమ్మకాలను వంచించడం ఎంతవరకు అనుమతించగలమని ప్రశ్నించారు.సినీ రంగంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి మహానుభావులు మాత్రమే ప్రజల హృదయాలను గెలుచుకుని, రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా తమ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలను ప్రభావితం చేశారని విజయ్ పేర్కొన్నారు. తాను కూడా సౌమ్య రాజకీయాలను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నానని వెల్లడించారు.

తన రాజకీయ ప్రవేశంపై విజయ్ మాట్లాడుతూ, తాను ఎలాంటి భయాందోళనలు లేకుండా అడుగులు వేస్తున్నానని, పేరు పెట్టకుండా చేసిన విమర్శలు తన భయానికి కాదు, గౌరవప్రదమైన రాజకీయాల పట్ల తన కమిట్‌మెంట్‌కు సంకేతమని అన్నారు. రాజకీయాలు పాముల ఆటను పోలినవని, తాను చిన్నపిల్లాడిలా ఉండవచ్చని కానీ, బరిలో దిగిన తర్వాత ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని విజయ్ తెలిపారు ఈ సందర్భంగా, విజయ్ తన పార్టీ లక్ష్యాలను పునరుద్ఘాటించారు. తమ పార్టీ ద్రవిడ రాజకీయం అనే పేరు మీద ప్రజలను మోసం చేసే వారిని, వారి అవినీతి పద్ధతులను నిషేధించడానికి నిలబడుతుందని పేర్కొన్నారు. “రాజకీయాల్లో నేను కొత్తవాడిని కావచ్చు, కానీ ప్రజల కోసం పనిచేసేందుకు నాకు తగిన చిత్తశుద్ధి ఉంది” అని విజయ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *