సచివాలయాన్ని ముట్టడించిన బెటాలియన్‌ కానిస్టేబుల్ కుటుంబాలు

families of the battalion constables who besieged the secretariat

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని జిల్లాల్లో కొన్ని రోజులుగా సాగుతున్న బెటాలియన్‌ పోలీసుల కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు రాష్ట్రంలో కానిస్టేబుల్‌ భార్యలు తమ పోరాటాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించారు. “ఏక్ పోలీస్, ఏక్ స్టేట్” విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, వారు సచివాలయాన్ని ముట్టడించారు. ఈ విధానం ద్వారా తమ భర్తలకు ఒకే చోట డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఆర్థిక మరియు కుటుంబ కష్టాలను దృష్టిలో ఉంచుకుని, వారు 3 నుండి 5 సంవత్సరాలు ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరికొన్ని విషయాలను ప్రస్తావిస్తూ..రిక్రూట్‌మెంట్‌లో ప్రత్యేక బలగాలను తీసుకుంటున్న విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ భర్తలు బెటాలియన్‌ ఉద్యోగులు కావడంతో, కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తున్నదని చెప్పారు. కానిస్టేబుల్‌ భార్యలు పెద్ద ఎత్తున సెక్రటేరియట్‌ వద్ద చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు బందోబస్తు పెంచారు.

మరోవైపు, “మా భర్తలు 9 నెలల కఠోర శిక్షణ తర్వాత పోలీసులుగా పాసై వచ్చారు. వారికి మిగతా సివిల్‌, ఏఆర్‌ పోలీసుల మాదిరిగా ఒకే చోట పనిచేయించరు? మేము ఏమి తప్పు చేశాము?” అని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. “మా భర్తలు ఏడాదికి మూడు జిల్లాలు మారాల్సి వస్తున్నాయి. మేము ఎక్కడ ఉంటాం? పిల్లలు ఎలా చదువుకుంటారు?” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భర్తలను తోటి పోలీసులే కించపరిచే విధంగా చూసుకుంటున్నారని, దీనికి సంబంధించి వారు బాధపడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా, సివిల్‌ మరియు ఏఆర్‌ పోలీసుల మాదిరిగా, బెటాలియన్‌ పోలీసులకు కూడా కనీసం 3-5 సంవత్సరాలు ఒకే జిల్లాలో పనిచేయడానికి అవకాశాన్ని కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల పిల్లల చదువుకు ఆటంకం ఉండకపోగా, కుటుంబాల పట్ల భారం కూడా తగ్గుతుందని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *