బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్‌..

Arrest warrant issued against former Prime Minister of Bangladesh Sheikh Hasina.

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబరు 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్‌ ప్రాసిక్యూటర్ మహమ్మద్‌ తజుల్‌ ఇస్లాం తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. ప్రధానిగా ఉన్న షేక్‌హసీనా పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తర్వాత నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి 60 ఫిర్యాదులు అందాయి. వాటిపై ట్రైబ్యునల్‌ ఇటీవల దర్యాప్తు ప్రారంభించింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని, ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.

హసీనా పాలనపై తీవ్ర నిరసన వ్యక్తంచేసిన విద్యార్థి సంఘాలు ఆమె భారత్‌లో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదిలాఉంటే.. హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) భారత ప్రభుత్వాన్ని డిమాండు చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క ఆమె దౌత్య పాస్‌పోర్టు రద్దయిన సంగతి తెలిసిందే. హసీనా హయాంలో ఎంపీలకు జారీ చేసిన దౌత్య పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలు వీసా లేకుండా ప్రయాణించే వీలు ఉంటుంది. ఆగస్టు 5న పదవి నుంచి దిగిపోయి భారత్‌కు చేరుకున్న తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.

ఇదిలా ఉంటే.. హసీనాను బంగ్లాకు రప్పించడానికి యూనస్‌ ప్రభుత్వం అన్ని యత్నాలు చేస్తందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ గతంలో పేర్కొంది. హసీనాను అప్పగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *