న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ సీఎంగా ఈరోజు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీనగర్‌లో ఉన్న షేర్ యే కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ప్రమాణస్వీకారోత్సవం జరగనున్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి ఓ మినిస్టర్ బర్త్ ఇచ్చేందుకు ఎన్సీ ఆఫర్ చేసింది. కానీ ఆ ఆఫర్‌ను కాంగ్రెస్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. బయట నుంచే ఎన్సీకి సపోర్టు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
ఇవాళ జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. ఒమర్ అబ్ధుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇప్పటికే ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత కనిమొళితో పాటు ఇతర నేతలు శ్రీనగర్ చేరుకున్నారు. ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో కలిసి ఆ నేతలు ఫోటోలు దిగారు. చెన్నైలో వర్షాల వల్ల ప్రమాణ స్వీకారోత్సవానికి స్టాలిన్ హాజరుకాలేకపోతున్నారు.