ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాలలో శని, ఆదివారాల్లో అన్నదాన కార్య క్రమం నిర్వహించనున్నట్లు భద్రాచలం దేవ స్థానం ఈఓ రమాదేవి మంగళవారం తెలిపారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయంగా ఉన్న పర్ణశాలలకు వారాంతంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోందని, ఈ నేపథ్యంలో ఆలయంలో అన్నదానం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
అలాగే భద్రాచలం రామాలయం సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను ప్రారభించబోతుంది. ‘భద్రాద్రి దివ్యక్షేత్రం’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ రమాదేవి మంగళవారం వెల్లడించారు. ఇందులో భద్రాచలం ఆలయం ఉత్సవాల విశేషాలను, పూజలు సహా పూర్తి సమాచారాన్ని అప్‌లోడ్ చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు ఇక్కడి రోజువారీ క్రతువుల గురించి వివరించే వెసులుబాటు లభించింది. ఇప్పటికే ఈ ఛానెల్ ట్రయల్ రన్ పూర్తయినట్టు అధికారులు తెలిపారు.