టాలీవుడ్ హీరో నారా రోహిత్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. తన చిత్ర జీవితంలో ఎందరో అభిమానులను సంపాదించిన రోహిత్, ఇప్పుడు తన జీవిత భాగస్వామిని కూడా కనుగొన్నారు. ఆయన త్వరలోనే ఓ ఇంటివాడవ్వబోతున్నాడు. “ప్రతినిధి-2” సినిమాలో ఆయనతో కలిసి నటించిన సిరి లేళ్ల తో నారా రోహిత్ ప్రేమలో పడి, జీవితాన్ని పంచుకోబోతున్నారు.
ఇవాళ హైదరాబాదులో నారా రోహిత్, సిరి లేళ్ల నిశ్చితార్థం అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు, పలు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల మనసులను కట్టిపడేస్తున్నాయి.
నిశ్చితార్థ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి హాజరై నారా రోహిత్ దంపతులకు ఆశీస్సులు అందజేశారు. చంద్రబాబు రోహిత్‌కు పెదనాన్న కావడం ఈ వేడుకలో మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
వీరికి సంబంధించిన పెళ్లి వేడుక వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉన్నప్పటికీ, అభిమానులు, సన్నిహితులు ఇప్పటికే ఆ వేడుకకు ఎదురుచూస్తున్నారు. సినీ పరిశ్రమలో రోహిత్, సిరి జంట గా కనిపించడమే కాకుండా, వారి జీవితంలోనూ ఇద్దరు కలిసి ఒక కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నారు.