దక్షిణ మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సును చుట్టుముట్టడంతో 41 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. కొంత మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడగా, ప్రమాదంలో మొత్తం 48 మంది ప్రయాణిస్తున్నారు. కాన్కున్ నుంచి టబాస్కో వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం సంభవించింది. బస్సులోని 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కు డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బయటకు రావడం అసాధ్యమయ్యిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు.

అధికారుల సమాచారం ప్రకారం, ఇప్పటివరకు మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బస్సు పూర్తిగా దగ్ధమవ్వడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై టబాస్కో రాష్ట్ర మేయర్ ఓవిడియో పెరాల్టా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన, బాధిత కుటుంబాలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
బస్సు కంపెనీ కూడా ఈ ఘటనపై స్పందించింది. ప్రమాద సమయంలో బస్సు పరిమిత వేగంలోనే ఉన్నదని పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది. మెక్సికోలో జరిగిన ఈ ఘోర ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.