బతుకమ్మ పండుగ చివరి అంకానికి చేరింది. చివరిదైన తొమ్మిదో రోజును సద్దుల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఈరోజు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు. గౌరమ్మకు నువ్వులు, పెసర్లు, వేరుశెనగలు, బియ్యంతో చేసిన సత్తుపిండి, పెరుగన్నం, పులిహోరని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. మహిళలంతా ఆడిపాడిన తర్వాత బతుకమ్మను కాలువల్లో, కుంటల్లో, చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 9 రోజులుగా ఘనంగా సాగుతున్న బతుకమ్మ సంబురాలు నేటితో ముగియనున్నాయి. ఈ రోజు (గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సంబురాల్లో ఏకంగా 10 వేల మంది మహిళలు పాల్గొనబోతునట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్లగొననున్నారు. కాగా.. సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్మారక చిహ్నం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మలతో మహిళల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల వరకు ట్యాంక్‌బండ్ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు పోలీసులు వెల్లడించారు.