వయనాడ్‌లో 358కు పెరిగిన మృతుల సంఖ్య

358 died in Wayanad landslide, deep search radars used to find survivors

వయనాడ్‌: కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి స‌మీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ‌చ‌రియ‌లు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 344కు పెరిగింది.

ఇంకా 281 మంది ఆచూకీ దొరకలేదు. శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు . డ్రోన్‌లు, థర్మల్‌ స్కానర్‌ల ద్వారా గాలిస్తున్నారు. ముండక్కైలో కొట్టుకుపోయిన ఓ దుకాణం దగ్గర శిథిలాల కింద జీవం ఉండొచ్చని థర్మెల్‌ స్కానర్‌ అప్రమత్తం చేసింది. అయితే, 3 మీటర్ల లోతులో, ఐదు గంటల పాటు వెతికినా మనిషి ఆనవాళ్లు దొరకలేదు.

మరోవైపు, పశ్చిమ కనుమలలోని 56,800 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనదని పేర్కొంటూ కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వయనాడ్‌లో కొండచరియల విధ్వంసానికి గురైన 13 గ్రామాలు కూడా దీని పరిధిలో ఉన్నాయి. పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. కేరళలో 9993.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సున్నిత ప్రాంతంగా పేర్కొంది. అదేవిధంగా హహారాష్ట్రలో 17,340, కర్ణాటకలో 20,668, తమిళనాడులో 6,914, గోవాలో 1,461, గుజరాత్‌లో 449 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దీని కిందకు వస్తుందని తెలిపింది.