జమ్మూలో ఎన్‌కౌంటర్..ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా గండోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ డివిజన్‌లోని దోడా జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో గండోహ్‌ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలను హతమార్చాయి. కాల్పుల్లో సైనికుడు గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నది.

ఇదిలా ఉండగా.. ఈ నెల 11న అర్ధరాత్రి భదేర్వా తహసీల్‌లోని ఛత్రగలన్‌లోని చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఒక ఎస్పీఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) గాయపడ్డారు. 9న రియాసి జిల్లాలో ఉగ్రవాదులు భారీ ఉగ్రదాడికి ఒడిగొట్టారు. కత్రా వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. మరుసటి రోజు సాంబాలోని ఓ ఇంటిపై దాడికి దిగారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ డివిజన్‌లో ఈ మూడు దాడిఘటనల అనంతరం సైన్యం భారీ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నది.