ఢిల్లీ లో నీటమునిగిన కోచింగ్‌ సెంటర్‌.. ముగ్గురు విద్యార్థులు మృతి

దేశ రాజధాని ఢిల్లీ లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలో ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు రావడంతో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కాగా.. ఒక అబ్బాయి ఉన్నారు. మృతి చెందిన ముగ్గురు విద్యార్థులను శ్రేయ, తాన్య, నెవిన్‌లుగా గుర్తించారు.

సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఐఏఎస్​ స్టడీ సెంటర్ నీట మునిగినట్లు తమకు ఫోన్ వచ్చిందని దిల్లీ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే ఐదు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలానికి వెళ్లామని, ​అప్పటికే బెస్​మెంట్ మొత్తం జలమయమై ఉన్నట్లు పేర్కొన్నారు. దిల్లీ అగ్నిమాపక బృందం, ఎన్​డీఆర్​ఎఫ్, స్థానికల పోలీసులు కలిసి చేపట్టిన సహాయక చర్యలతో ఇద్దరు మహిళ అభ్యర్థులు, ఒక పురుష అభ్యర్థి మృతదేహాన్ని వెలికితీశామని తెలిపారు. ప్రమాద సమయంలో పలువురు విద్యార్థులను తాళ్ల సాయంతో రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని తెలిపారు.