రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర మొదలు

రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర మొదలు కాబోతుంది. దీనికి సంబదించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం రాత్రి 9 గంటలకు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు కమిటీ సభ్యులు. రాత్రి11:30 నిమిషాలకు కలశం పూజ చేయనున్నారు. తర్వాత ఈరోజే మహా గణపతిని పూజారులు కదిలించనున్నారు. మంగళవారం ఉదయం సుమారు 7 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, సెన్సేషన్ థియేటర్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పక్క నుంచి ట్యాంక్ బండ్​పైకి చేరుకోనున్నాడు.

రేపు మధ్యాహ్నం 1.30 లోపు నిమజ్జనం పూర్తి చేయనున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఇప్ప‌టికే 30 శాతం గ‌ణ‌నాథులను నిమ‌జ్జ‌నం చేయ‌గా, మిగ‌తా గ‌ణేశ్ విగ్ర‌హాల‌ను రేపు మంగ‌ళ‌వారం నిమ‌జ్జ‌నం చేయ‌నున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌కు ప్ర‌ధాన శోభాయాత్ర కొన‌సాగ‌నుంది. ప్ర‌ధాన శోభాయాత్ర జ‌రిగే మార్గాల్లో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

శోభాయాత్ర మార్గాలు చూస్తే..

బాలాపూర్‌ నుంచి వచ్చే గణేషుడి శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, నాగుల చింత, చార్మినార్‌, అఫ్జల్‌గంజ్‌, ఎంజేమార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, లిబర్టీ, అంబేద్కర్‌ విగ్రహాం, ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు వరకు ప్రధాన శోభయాత్ర జరుగుతుంది.

ఉప్పల్‌ వైపు నుంచి వ‌చ్చే గ‌ణ‌నాథుల‌ను శ్రీరమణ జంక్షన్‌, 6 నెం. జంక్షన్‌, తిలక్‌నగర్‌, శివమ్‌ రోడ్డు, ఎన్‌సీసీ, విద్యానగర్‌ టీ జంక్షన్‌, హిందీ మహావిద్యాలయ, ఫీవర్‌ ఆసుపత్రి, బర్కత్‌పురా, వైఎంసీఏ, నారాయణగూడ ఎక్స్‌ రోడ్స్ వ‌ద్ద‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వైపు నుంచి వచ్చే ర్యాలీలో కలుసుకోవాలి. అలాగే దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్‌ సదన్‌, సైదాబాద్‌ వైపు నుంచి నల్గొండ క్రాస్‌రోడు వైపు నుంచి వచ్చే వినాయ‌క విగ్ర‌హాలు.. మూసారాంబాగ్‌, అంబర్‌పేట్‌ మీదుగా హిమాయత్‌నగర్‌ వైపుకు వెళ్లి ప్రధాన ర్యాలీలో క‌ల‌వాలి. అలాగే తర్నాక నుంచి వచ్చే వాహనాలు ఫీవర్‌ ఆసుపత్రి వద్ద నుంచి ప్రధాన ర్యాలీలో కలుసుకోవాలి.

టోలిచౌకీ, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు మాసబ్‌ట్యాంక్‌, నిరంకారీ, ఓల్డ్‌ సైఫాబాద్‌, ఇక్బాల్‌ మినార్‌ నుంచి ఎన్టీర్‌ మార్గ్‌కు చేరుకోవాలి. ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, పంజాగుట్ట, ఖైరాతాబాద్‌ వైపు నుంచి నిరాంకారి వద్ద యాత్రలో కలువాలి. ఆసీఫ్‌నగర్‌ సీతారాంబాగ్‌, అఘాపురా, గోషమహాల్‌, అలాస్క, మాలకుంట జంక్షన్‌ నుంచి వచ్చే యాత్ర ఎంజే మార్కెట్‌ వద్ద ప్రధాన యాత్రలో కలువాలి.

సికింద్రాబాద్‌ వైపు వచ్చే యాత్ర ఆర్పీరోడ్డు, ఎంజేరోడ్డు, కర్బాలమైదాన్‌, కవాడిగూడ, ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్డు, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, నారాయణగూడ క్రాస్‌రోడ్డు, హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ నుంచి ప్రధాన యాత్రలో కలుస్తాయి. చిలకలగూడ వైపు నుంచి వచ్చే యాత్ర గాంధీ దవాఖాన వద్ద నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్స్, నారాయణగూడ ఫ్లై ఓవ‌ర్, నారాయణగూడ వై జంక్షన్‌, హిమాయత్‌నగర్‌ నుంచి లిబర్టీ వద్ద ప్రధాన ర్యాలీకి కలుసుకోవాలి.