దేశవ్యాప్తంగా రూ.2 వేల నోట్ల చెలామణి 2023లో రద్దైన విషయం అందరికీ తెలుసు. అయితే, ఆ నోట్లు ఇప్పుడు బయటపడటమే కాదు, ఓ ఆలయ హుండీలో కనిపించడం సంచలనం సృష్టించింది. రద్దయిన నోట్లను ఇంట్లో ఉంచుకోవడం వలన ప్రయోజనం లేదని, స్వామి వారికి హుండీ కానుకగా ఇస్తే పుణ్యం వస్తుందని ఆలోచించిన ఓ భక్తుడు, రూ.2 వేల నోట్లను స్వామి వారికి సమర్పించినట్లున్నాడు.గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు జరుపుతుండగా, అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ రద్దయిన రూ.2 వేల నోట్లు బయటపడ్డాయి.

మొత్తం 122 నోట్లు (రూ.2.44 లక్షలు) హుండీ నుంచి రావడంతో అక్కడి సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు.చెల్లుబాటు కాని నోట్లను ఎవరో స్వామి వారికి కానుకగా సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఆలయ భక్తుల మధ్య ఆసక్తికర చర్చలకు దారితీసింది.అయితే, ఈ కానుకల వెనుక ఉద్దేశం ఏమిటనేది స్పష్టంగా తెలియడం లేదు. ఆ భక్తుడు ఆ నోట్లను ఎందుకు సమర్పించాడో, అతను ఎవరనేది కూడా తెలియరాలేదు. ఇది భక్తుడి అమాయకత్వమా లేక విశ్వాసమా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.ఇలాంటి సంఘటనలు ఆలయ హుండీల్లో చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే, ఈ ఘటన ఆలయ సిబ్బందిని, భక్తులను ఒకింత ఆలోచనలో పడేసింది. రద్దయిన నోట్లతో స్వామివారి సేవను చేసుకోవాలనుకున్న ఆ భక్తుడి విశ్వాసం కొందరిని ఆశ్చర్యపరచగా, మరికొందరిని నవ్వించేలా చేసింది.ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. అయితే, ఈ సంఘటన ఆలయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుందని మాత్రం చెప్పవచ్చు.