యూపీలోని ఉన్నావ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి

యూపీలోని ఉన్నావ్‌లో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్యాంకర్, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. మృతుల్లో 14 మంది పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారి చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున 5.15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఉన్నావ్‌ పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను బస్సు నుంచి బయటికి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. బస్సు బీహార్‌ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. అక్కడ స్థానికులు పొలాల వైపు వెళుతుండగా పెద్ద శబ్దం వినిపించింది. ప్రమాద స్థలం నుంచి మమ్మల్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడికి వారు చేరుకున్నప్పుడు. అక్కడ 50-60 మంది ప్రమాదంలో రక్తపు మడుగులో కనిపించారు. ప్రమాదం చూసిన వెంటనే స్థానికులు భయపడిపోయారు. పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గ మధ్యంలో 10 మంది చనిపోయారని పేర్కొన్నారు.