తెలంగాణ స్థానిక‌త ఉన్న 122 మంది ఉద్యోగుల‌ రిలీవ్ చేసిన ఏపి ప్రభుత్వం

ap state logo
ap state logo

అమరావతి: తెలంగాణ స్థానిక‌త ఉన్న 122 మంది ఉద్యోగుల‌ను రిలీవ్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్ర‌భుత్వం అభ్య‌ర్థ‌న మేర‌కు ఏపీ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఇక‌పై తెలంగాణ‌లో ప‌ని చేయ‌నున్నారు. కాగా, రిలీవ్ అవుతున్న వారు త‌మ క్యాడ‌ర్ చివ‌రి స్థానంలో ఉంటార‌ని చెప్ప‌డం, అందుకు ఉద్యోగులు అంగీక‌రించ‌డంతో వారిని రిలీవ్ చేస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి.

అయితే ఏపీ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ స‌మ‌యంలో తెలంగాణ‌కు చెందిన ఉద్యోగులు కొంద‌రు ఏపీకి, ఏపీకి చెందిన మ‌రికొంద‌రు తెలంగాణ‌కు కేటాయించ‌బ‌డ్డారు. దాంతో సొంతూళ్ల‌కు వెళ్లేందుకు ఆయా ఉద్యోగులు ప‌దేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో హెచ్ఓడీ కార్యాల‌యాలు, స‌చివాల‌యం, 9, 10వ షెడ్యూల్ సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు త‌మ సీనియారిటీ కోల్పోయినా స‌రే త‌మ‌ను తెలంగాణ‌కు రిలీవ్ చేయాల‌ని ఇరు రాష్ట్రాల సీఎంల‌ను కోర‌డం జ‌రిగింది. వారి అభ్య‌ర్థ‌నను రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఆమోదించాయి. దీంతో ఇప్పుడు 122 మంది తెలంగాణ‌ ఉద్యోగుల స‌మ‌స్య‌కు తెర‌ప‌డింది. ఇక‌పై వారు సొంత రాష్ట్రంలోనే ప‌ని చేయ‌నున్నారు.