హైదరాబాద్ లో మరో బాలిక కిడ్నాప్

హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు, అత్యాచారాలు , నేరాలు , కిడ్నాప్ లు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట కిడ్నాప్ అనే వార్త వెలుగులోకి వస్తుంది. రెండు రోజుల క్రితం అబిడ్స్ లో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ ను పోలీసులు చెందించగా..ఇప్పుడు 12 ఏళ్ల అమ్మాయిని గుర్తు తెలియని దుండగలు కిడ్నాప్ చేసిన ఘటన బయటకు వచ్చింది. హబీబ్నగర్లో నిన్న రాత్రి కరెంట్ లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు. కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

మార్గమధ్యలో దుండగుడి నుంచి బాలిక తప్పించుకుంది. వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసులు ఆమెను తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చారు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులతో స్థానిక ఠాణాకు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే దుండగుడు తెలిసిన వాడే అయి ఉంటాడని .. అలా దర్జాగా ఇంట్లోకి వెళ్లి బాలికను కిడ్నాప్ చేశాడంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.