న్యూఢిల్లీ: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11,440 కోట్లతో కేంద్రం ప్యాకేజీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారిక ప్రకటనలో తెలిపారు. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీని ఇస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్యాకేజీకి కేంద్రమంత్రివర్గం బేషరతుగా ఆమోదం తెలిపినట్టు మంత్రి వెల్లడించారు. నష్టాల ఊబిలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆదుకోవాలని లేదా సెయిల్‌లో విలీనం చేయాలంటూ కార్మికులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయంతెల్సిందే. ఇందులోభాగంగానే ఈ ఫ్యాక్టరీని ఆదుకునేందుకు కేంద్ర ముందుకు వచ్చింది.

కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ ప్రకటించిన ప్యాకేజీలో రివైవల్ ప్యాకేజీకి కింద రూ.10,300 కోట్లు కేటాయించారని, ఉక్కు పరిశ్రమ నష్టాలను అధికమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమ పూర్తిస్థాయిలో ఉత్పాదకతతో లాభాల బాటలో పయనించేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. నవ్యాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ ప్యాకేజీ నిదర్శనమని రామ్మోహన్ వివరించారు.
కాగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్థాపించారు. భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. విశాఖపట్టణం నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో ఈ ప్లాంట్‌ను నిర్మించారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు దేశ విదేశాల్లో మంచి పేరున్నది. సంస్థ రాబడిలో 80శాతం జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయి, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వచ్చాయి. 2010 నవంబరు 10న నవరత్న హోదా పొందింది. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల్లో కొనసాగుతున్నది. కంపెనీ అప్పులు భారీగా పేరుకుపోయాయి.