పిల్లలు అన్ని విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అయితే వాళ్లు అలా ప్రవర్తించడానికి అమ్మానాన్నలు పిల్లలతో జాగ్రత్త గా వ్యవహరించాలి .
పిల్లల బలహీనతలను పదేపదే ఎత్తిచూపకూడదు. ఇలా వారి బలహీనతల గురించి మాత్రమే మాట్లాడితే కొంతకాలానికి వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం పోతుంది. పిల్లలు లేత మనసును కలిగి ఉండడం వల్ల సాధారణంగా విమర్శలను తట్టుకోలేరు. వారి బలాలను గుర్తించి ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఏదైనా పని చేస్తామని పిల్లలు ఉత్సాహం చూపించినప్పుడు.. అది నీవల్ల కాదని వాళ్ళను నిరుత్సాహపరచకూడదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో పని చేయిస్తే సమయం వృథా అవుతుందనుకుంటారు. దాంతో వాళ్లకు ఎప్పటికీ పనిరాదు. దగ్గరుండి సాయంపడి వాళ్లా పని పూర్తిచేసేలా చూడాలి. దీనివల్ల పిల్లలకు వాళ్లమీద వాళ్లకు నమ్మకం పెరుగుతుంది. మనం ఈదిన పని చెప్పినపుడు పిల్లలు దానిని పూర్తిచేస్తే వాళ్లను మెచ్చుకుని ప్రోత్సహించాలి. ఆలా పొగడడం వల్ల వాళ్లకి ఆనందం కలిగి మరింత ఉత్సాహంగా పనులు చేస్తారు. కానీ వాళ్లను పొగడటమే పనిగా పెట్టుకోకూడదు. అలా అలవాటు పడితే చిన్నపని చేసినా పొగడ్తల కోసం ఎదురుచూడటం మొదలుపెడతారు.
పిల్లతో తల్లితండ్రులు ఎప్పుడు స్నేహభావంతో ఉండాలి. ప్రతి విషయాన్నీ చెప్పుకునే శ్వేచ్చ తల్లితండ్రులు పిల్లలకు ఇవ్వాలి. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు.