న్యూఢిల్లీ: శీతాకాలం, పండుగలు సమీపిస్తున్నప్పుడు, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన విషయం తెలిసిందే. ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ పరిస్థితి దృష్ట్యా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాల వైద్యారోగ్య శాఖలకు హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉదయాన్నే నడక, క్రీడల వంటి కార్యకలాపాలను తగ్గించుకోవాలని సూచించింది. వాయు కాలుష్యం అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నందున, వీటిని పరిమితం చేయాలని అవసరం ఉందని తెలిపారు.
అంతేకాక, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, వృద్ధులు మరియు ట్రాఫిక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వాతావరణ మార్పు మనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని సూచనలు చేశారు. వాయు కాలుష్యానికి సంబంధించిన వ్యాధులను పర్యవేక్షించడానికి నిఘా వ్యవస్థలతో సహకారం పెంచాలని చెప్పారు.
అలాగే, పంట వ్యర్థాలను కాల్చడం, పండుగ సమయంలో బాణాసంచాలు ప్రయోగించడం, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించడం మరియు డీజిల్ ఆధారిత జనరేటర్లపై ఆధారపడడం వంటి చర్యలను తగ్గించాలన్నారు. వ్యక్తులు ప్రభుత్వ యాప్ ద్వారా గాలి నాణ్యతను పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే శ్వాసకోశ మరియు హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు కాలుష్యం అధికంగా ఉండే సమయంలో బయట తిరగకుండా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.