ఇటీవల సినీరంగంలో లైంగిక వేధింపులు అధికం అవుతున్నాయి. తాజాగా యువనటిని లైంగికంగా వేధించడంతోపాటు ఆమె ప్రైవేటు వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న కేసులో కన్నడ టీవీ సీరియల్ నటుడు చరిత్ బాలప్పను పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నటుడికి అరదండాలు వేశారు. నిందితుడు 2023 నుంచి వేధింపులకు పాల్పడుతుండగా ఈ నెల 13న నటి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
పలు విధాలా బెదిరింపులు
బాధితురాలు ఒంటరిగా నివసిస్తుండటాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న నిందితుడు తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడు. అంతేకాదు, తన అనుచరులతో కలిసి నటి ఇంటి వద్ద నానా హంగామా చేసేవాడు. శారీరక బంధం కోసం ఒత్తిడి తెచ్చేవాడు. అంతేకాదు, తన ఆర్థిక అవసరాలు తీర్చకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించేవాడు.
బాధిత నటి 2017 నుంచి కన్నడ, తెలుగు సీరియళ్లలో నటిస్తోంది. గతేడాదే నిందితుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఆ తర్వాతి నుంచి ఆమెపై వేధింపులు మొదలయ్యాయి. చరిత్ తనను మానసికంగా వేధించడంతోపాటు చంపేస్తానని కూడా బెదిరించినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
అతడికి రాజకీయ నాయకులు, రౌడీలతో సంబంధాలు ఉన్నాయని, వాటిని ఆసరాగా చేసుకుని తనను జైలుకు పంపిస్తానని బెదిరించేవాడని నటి తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడికి ఇప్పటికే వివాహమై విడాకులు కూడా తీసుకున్నాడని, తను చెప్పినట్టు వినకుంటే చంపేస్తానని బెదిరించాడని ఆరోపించింది.