స్మార్ట్ ఫోన్లు వచ్చాక యువతలో చాలామంది తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్స్ వచ్చాక చిన్నపిల్లల పై కూడా ఈ ప్రభావం అధికం అయినది. ఇక పబ్‌జీ ఆట పిచ్చితో అనేకుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా బిహార్‌లో పబ్‌జీ ఆట పిచ్చి ముగ్గురు టీనేజర్ల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్‌జీ ఆడుతున్నారు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంలో రైలు వస్తున్న సంగతిని వారు గుర్తించలేదు. దాంతో వేగంగా వచ్చిన ట్రైన్ వారిపైనుంచి వెళ్లిపోయింది. రైలు పట్టాలపై పబ్‌జీ ఆడటంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్కతియాగంజ్-ముజఫర్‌పూర్ రైలు సెక్షన్‌లోని మాన్సా తోలాలోని రాయల్ స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

పిల్లల గేమింగ్ అలవాట్లపై జాగ్రత్తలు
సదర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌డీపీఓ) వివేక్ దీప్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రైలు పట్టాలపై పబ్‌జీ ఆడటం వల్ల కలిగే ప్రమాదాల గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల గేమింగ్ అలవాట్లను పేరెంట్స్ పర్యవేక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలను జరగకుండా బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలని అధికారులు తల్లిదండ్రులను కోరారు.
మృతులను రైలు పట్టాలపై పబ్‌జీ ఆడుతుండగా గుమ్టి నివాసి ఫుర్కాన్ ఆలం, మన్షా తోలాకు చెందిన సమీర్ ఆలం, బారి తోలా నివాసి హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మంది స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించామని తదుపరి విచారణ కొనసాగుతున్నదని తెలిపారు. ఇటీవల పలువురు యువకులు ఈ విధంగా సేఫ్ కాని ప్రదేశాల్లో పరధ్యానంగా ప్రవర్తించడం వల్ల వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండటానికి బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులు, అధికారులు పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. మృతుల కుటుంబీకులు వారి పిల్లల మృతదేహాలను అంత్యక్రియల కోసం స్వగ్రామాలకు తరలించారు. రైలు పట్టాలపై పబ్‌జీ ఆడటం స్థానికంగా విషాదాన్ని నింపింది.