భారత యుద్ధనౌకలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి కొద్దిసేపటి ప్రధాని మోడీ జాతికి అంకితం చేసారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్- నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్‌షేర్ యుద్ధనౌకలను రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి ఈ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకున్నారాయన. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశ నౌకాదళం ఇక మరింత శక్తిమంతమైంది. సముద్ర జలాల్లో గస్తీని పెంచడం, ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేలా రూపుదిద్దుకుంటోంది. చైనా దక్షిణ సముద్ర తీర ప్రాంతం నుంచి ముప్పు పొంచివున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత శక్తిమంతమైన మూడు యుద్ధనౌకలు బరిలోకి దిగాయి.

తొలుత- నౌకాదళాధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్- ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, ఈ క్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దేశ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్‌పోర్ట్స్ సామర్థ్యం రెట్టింపు అవుతోందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దలాది కొత్త నౌకలు, కొత్త కంటైనర్లు అవసరమౌతాయని మోదీ పేర్కొన్నారు. వాటిని తయారు చేసుకునే క్రమంలో దేశవ్యాప్తంగా గల అన్ని పోర్టులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతమివ్వబోతోన్నాయని అన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని అన్నారు. జనావాసాలకు దూరంగా ఉంటూ వస్తోన్న దీవులను కూడా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతను ఇస్తోన్నామని మోదీ చెప్పారు.