టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీ విషయంలో ఆయనకూ, కుమారుడు మంచు మనోజ్ కు సాగుతున్న పోరు తాజాగా మరో మలుపు తిరిగింది. మోహన్ బాబు యూనివర్శిటీలోకి వెళ్లేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్న మంచు మనోజ్.. భార్య మౌనికా రెడ్డితో కలిసి వచ్చారు. పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా యూనివర్శిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో యూనివర్సిటీ సిబ్బందికీ, మనోజ్ బౌన్సర్లకూ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చివరకు పోలీసులకు తన తాత సమాధి వరకూ వెళ్లి వస్తానని చెప్పి అనుమతి తీసుకుని మనోజ్ లోపలికి వెళ్లారు.

మోహన్ బాబు యూనివర్శిటీలోకి వెళ్లకుండా మంచు మనోజ్ పై కోర్టు ఆంక్షలు విధించినా తన తాత సమాధికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించడం తాజా వివాదానికి కారణమైంది. దీంతో వివాదం ముగిసిందని భావిస్తున్న తరుణంలో పోలీసులు, మోహన్ బాబు వర్శిటీ సిబ్బందిపై మనోజ్ ఫైర్ అయ్యారు.
దీనికి కొనసాగింపుగా మోహన్ బాబు యూనివర్శిటీ సిబ్బందిపై చంద్రగిరి పోలీసు స్టేషన్ కు వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ దంపతులపై మోహన్ బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్‌బాబు పీఏతో పాటు ఎంబీయూ సిబ్బంది 8 మందిపై కేసులు పెట్టారు. దీంతో ఈ వ్యవహారంలో పోలీసుల తదుపరి యాక్షన్ పై ఉత్కంఠ నెలకొంది.