సంధ్య థియేటర్ వద్ద ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో ‘పుష్ప-2’ నిర్మాతలు రవిశంకర్, నవీనలకు హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఈ ఘటనలో వారిని అరెస్ట్ చేయరాదని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీనితో నిర్మాతలు తాత్కాలికంగా న్యాయ పరిరక్షణ పొందారు.
అయితే, కేసు దర్యాప్తు మాత్రం కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఘటనలో ఉన్న అనేక అనుమానాలు, సంఘటనల పూర్తి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు పూర్తిగా జరగాలని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో, కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని బాధితులు కోరుతున్నారు.
ఈ తొక్కిసలాటలో పలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడగా, థియేటర్ వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ చర్యపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా, పోలీసుల చర్యలను సమర్థించినవారూ ఉన్నారు. ఈ విషయంపై పోలీసులు సమగ్ర నివేదిక అందించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) నోటీసులు జారీ చేసింది.
ఇక పుష్ప 2 ప్రీమియర్ సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం , రేవతి అనే మహిళ మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు హీరో అల్లు అర్జున్ తో పాటు పలువురి పై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసున్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్ట్ లో నడుస్తుంది. హీరో తో పాటు పలువురు బెయిల్ పై బయటకు వచ్చారు.