హైదరాబాద్: ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలు చర్చకు రాబోతోన్నాయి. ముఖ్యంగా, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఐదు పెండింగ్ డీఏలతో పాటు, వారి సమస్యలపై కేంద్రీకృతంగా చర్చలు జరగనున్నాయనీ సమాచారం. సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసారు. జీవో నెం.317 కూడా చర్చనీయాంశంగా ఉండే అవకాశం ఉంది.
మూసీ వరద బాధితులకు పరిహారం గురించి కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పై అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బీసీ కుల గణన, కొత్త ఆర్వోఆర్ చట్టంపై కూడా కేబినెట్ చర్చించనుందని తెలుస్తోంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం.
జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు కట్టబెడుతున్న నేపథ్యంలో, పురపాలక చట్టంలో సవరణలు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు, కొత్త రేషన్ కార్డుల వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించబడే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడులు మరియు రైతుభరోసా పథకం గురించి కూడా కేబినెట్ చర్చించనుంది. ఈ నెలాఖరు లోపు రుణమాఫీ పొందని రైతులకు ఈ పథకం వర్తింపజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.