తెలంగాణ లోని ప్రభుత్వ హాస్టల్స్ లలో , ఆశ్రమాల్లో వరుసపెట్టి ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు ఎక్కడో చోట ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి విద్యార్థులు హాస్పటల్ పాలవుతున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయంలో ఈరోజు అదే జరిగింది. నాగర్‌కర్నూల్ మండలం నాగనూలు గ్రామంలో ఉన్న ఈ విద్యాలయంలో ప్రేమలత, అక్షయతో పాటు మరో విద్యార్థి అస్వస్థతకు గురయ్యారు. వీరికి వాంతులు, విరోచనాలు, దగ్గు వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కస్తూర్బా విద్యాలయ సిబ్బంది ప్రకారం.. బయటి ఫుడ్డు తిన్న ఒక విద్యార్థి వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని చెబుతున్నారు. అయితే, ఇతర ఇద్దరు విద్యార్థులకు కూడా ఇదే సమస్య రావడంతో ఈ అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సిబ్బందిపై ప్రశ్నలు లేవనెత్తారు. ముగ్గురు విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు మాత్రమే బయట ఫుడ్డు తిన్నారని, మిగతా ఇద్దరికి ఎలా ఫుడ్ పాయిజన్ అయిందనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విద్యాలయంలోని ఆహార నిర్వహణపై వారు సందేహాలు వ్యక్తం చేస్తూ మెరుగైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై విద్యాలయ సిబ్బంది స్పందన తగినంత బాధ్యతతో లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో సరైన పరిశుభ్రత లేకపోవడం, ఆహార నాణ్యతపై పట్టింపులు లేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై నాగర్‌కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు, దీనిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.