పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి ఉడాయించాడో దొంగబాబా. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో వెలుగుచూసిందీ మోసం. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 1.75 లక్షల నగదు, మొబైల్ ఫోన్స్, ఒక కారు, పాత ఇత్తడి బిందెలు, బంగారం పూత వేసిన నాణేలు, స్ర్పేలు స్వాధీనం చేసుకున్నారు. ఆనందపురం పోలీసుస్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలను సీఐ వాసునాయుడు వెల్లడించారు. ఆనందపురం మండలం బంటుపల్లివారి కల్లాలుకు చెందిన అప్పలరాజుకు రెండు నెలల క్రితం బంధువుల ద్వారా విశాఖ నగరం కంచరపాలెం బర్మాక్యాంపునకు చెందిన యోగేంద్రబాబా అలియాస్ పైడిపాటి వెంకటభార్గవ్ రాఘవ(35), అతడి బృందం పరిచయమయ్యారు. పూజలు చేస్తే లంకెబిందెలు లభ్యమవుతాయని వారు అప్పలరాజును నమ్మించారు. అందుకు రూ.లక్షలు ఖర్చు అవుతాయనడంతో అప్పలరాజు మరో ముగ్గురు స్నేహితులను కలుపుకున్నాడు. నలుగురూ కలిసి దఫదఫాలుగా యోగేంద్రబాబాకు రూ.28 లక్షలు ఇచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం యోగేంద్రబాబా ఆనందపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మండలంలోని గుడిలోవలో ఒకచోట రాళ్లతో నింపిన రెండు బిందెలను తన బృందంతో పాతిపెట్టించాడు. ఆ తరువాత అప్పలరాజు తదితరులను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి పూజలు నిర్వహించాడు. బిందెలు పాతిపెట్టించిన ప్రాంత ంలో వారితో తవ్వించి లంకె బిందెలు లభించాయని నమ్మించారు. వాటిని ఆనందపురంలో యోగేంద్రబాబా అద్దెకు తీసుకున్న ఇంటికి తరలించారు.లంకె బిందెలను మరోమారు పూజలు నిర్వహించిన తర్వాత తెరవాలని యోగేంద్రబాబా చెప్పాడు. అందుకు కొంత డబ్బు తీసుకురావాలని ఆ నలుగురికి సూచించాడు. పూజలు చేయకపోతే రక్తం కక్కుకుని చస్తారంటూ బెదిరించాడు. దీంతో మిగతా డబ్బులు ఇచ్చేందుకు అప్పలరాజు, అతని మిత్రులు సిద్ధపడ్డారు. అయితే ఫోన్ చేసినా యోగేంద్రబాబాతీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
