రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ దిశగా తొలి అడుగు పడబోతోంది. వివిధ రకాల సేవలు, సర్టిఫికెట్ల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ ఇక ఉండబోదు. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పాలనాపరమైన సంస్కరణలకు చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్ తెర తీసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పరిపాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. చంద్రగిరి నారావారి పల్లెలో ఈ విషయాన్ని వెల్లడించారాయన. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేష్ ఇతర అధికారులతో కలిసి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కొందరు రేషన్ కార్డులు లేవని, మరికొందరు ఆధార్ కార్డులు లేవంటూ తన దృష్టికి తీసుకొచ్చారని, ఆయా సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి సరికొత్తగా వాట్సప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టనున్నామని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో స్థానికత, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, అడంగల్.. వంటి సేవలన్నింటినీ కూడా వాట్సప్ ద్వారా దరఖాస్తుదారులకు అందజేస్తామని చెప్పారు.