తెలంగాణలో రెండు రోజులు వర్షాలు పడేఅవకాశం వుంది. నిన్న నుంచి హైదరాబాద్ మబ్బులతో ముసురుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే ఐదు రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఈ ఐదు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక నిన్న మొన్న కురిసిన వర్షాలకు పలు చోట్ల వరి ధాన్యంతో పాటు ఇతర పంటలు తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా నిన్న ఇవాళ అక్కడక్కడ వర్షాలు కురిశాయి. చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పశ్చిమ మధ్య – నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో ఇది క్రమంగా బలహీన పడుతోందని ఏపీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావం కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని పలు చోట్లు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

ఒకటి రెండు చోట్లు భారీ వర్షాలు
రాగల 24 గంటల్లో ఒకటి రెండు చోట్లు భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది. ఈ సమయంలో సముద్రం తీరం వెంబడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని సూచించింది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్ల వద్దని మత్స్యకారులను ఈ సందర్బంగా వాతావరణ కేంద్రం హెచ్చరించింది.