జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ (BRS) పెద్దలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం అమలుపై నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని చెప్పించేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని, కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బండి సంజయ్ అన్నారు.
పార్టీలో పాల్గొన్న వ్యక్తుల వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని, పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని, సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఎటువంటి రహస్య ఒత్తిళ్లు లేకుండా సక్రమంగా అరెస్టులు జరగాలని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గతంలో పోలీసులు కేసీఆర్ కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నించారని కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కేసును పర్యవేక్షించాలని ఆయన కోరారు.